Saturday, October 12, 2013

సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది


సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది. సరః అంటే సారము, స్వ అంటే తన యొక్క అని అర్దం. తన యొక్క సారాన్ని/తత్వాన్ని సంపూర్ణంగా తెలిపేది సరస్వతి.

మనం ఆత్మ స్వరూపులం అయినా, మనల్ని మనం శరీరంగా భావించుకుంటాం. మనసుకు కలిగిన బాధలను మనవిగా భావించి బాధపడతాం. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించేది దేహము, దేహంలో ఉన్న మనస్సే కానీ, మనం కాదు. కానీ శరీరానికి కలిగిన కష్టనష్టాలకు, దుఃఖాలకు కృంగిపోతాం. అహంకారమమకారాలకు బానిసలమై, పరిమితి కలిగిన ఈ దేహాన్నే మనంగా ఊహించుకుంటూ జీవిస్తున్నాం.

కానీ నిజానికి మన తత్వం ఏమిటి? మనమేమిటి?....................... అని ఆలోచిస్తే ఎప్పుడు మనలో 'నేను' అనే తలంపు ఒకటి మెదులుతుంటుంది. ఈ దేహం పుట్టినప్పటి నుంచి మరణించేవరకు ఆ తలంపు మనల్ని వీడదు. ఆ 'నేను' అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకునేందుకు ధ్యానంలో విచారాణ ప్రారంభిస్తే, అది ఆఖరున ఆత్మలో లయమవుతుందంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆత్మ మన సహజ స్థితి, నిత్యానంద స్థితి, ఆత్మయే మనం. ఈ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఆ ఆత్మయే మనం. ఆత్మకు పరిమితి లేదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఈ లోకంలో ఆత్మ తప్ప మరొకటిలేదు.

ఈ ఆత్మ తత్వమే సనాతన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపింది. ప్రపంచంలో ఇతర మతాలు అశాశ్వతమైన ఈ శరీరం గురించి చెప్తే, మన ధర్మం సనాతనమైన ఆత్మ తత్వం గురించి ప్రపంచానికి చెప్పింది. మానవజన్మకు సార్ధకత/ నిర్యాణం/ మోక్షం లభించాలంటే ఆత్మ తత్వం అర్దమవ్వాలి. అటువంటి ఆత్మ తత్వం(మన తత్వం) గురించి మనకు సంపూర్ణంగా తెలియజేస్తుంది కనుక అమ్మను సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం.

ఓం సరస్వత్యై నమః
 —

No comments:

Post a Comment